శివయ్య ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. ఒక్కో చోట ఒక్కో ప్రఖ్యాతిని గాంచాయి. అయితే పరమేశ్వరుడు ఒక్కో చోట ఒక్కో పేరుతో ప్రఖ్యాతిగాంచాడు. పవిత్ర గోదావరీ నదీ తీరాన ఓ ఆలయం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కుండలేశ్వరస్వామిగా వెలసి ఉన్నాడు. ఈ ఆలయం గురించి మార్కండేయ మహర్షి చంద్రశేఖరాష్టకంలో ప్రస్తావించాడు. ‘కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం’ అంటూ ఈ ఆలయాన్ని స్తుతించారు. ఆయనకు పూర్వం నుంచి ఉన్న అతి ప్రాచీన దేవాలయమే కుండలేశ్వర స్వామి ఆలయంగా పేర్కొంటారు.
కాశీ క్షేత్రానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత ఈ క్షేత్రానికి ఉందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా వ్యవహరిస్తున్నారు. అతి ప్రాచీనమైన ఈ కుండలేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రమే కుండలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభువుగా శివలింగంగా వెలసి ఉన్నాడు. ఈ శివలింగం చెవి కుండలాల ఆకారంలో ఉంటుంది. అందుకే ఇక్కడి స్వామివారిని కుండలేశ్వరస్వామిగా పిలుస్తారు. కుండలేశ్వర స్వామి వారు వెలసినందునే ఈ క్షేత్రానికి “కుండలేశ్వరం” అన్న పేరు వచ్చిందని చెబుతారు.
