తమిళనాడులోని తిరుకడవూర్ ఆలయంలో కొలువైన అమృతఘటేశ్వర్, అభిరామి గురించి తెలుసుకున్నాం కదా. మార్కండేయుడి కథ కూడా ఇక్కడే జరిగిందని చెబుతారు. బాలుడిగా ఉన్న సమయంలోనే మార్కండేయుడికి ఆయుష్షు తీరిపోవడంతో యమధర్మరాజు పాశం నుంచి తప్పించుకునేందుకు వెళ్లి శివలింగాన్ని కౌగిలించుకున్నాడని తెలుసుకదా. ఆ శివలింగం మరేదో కాదు.. అమృత ఘటేశ్వరుడేనని చెబుతారు. యముడు పాశాన్ని వేయవద్దని శివుడు ఆదేశించినా వినకుండా యముడు మొండితనంతో పాశం విసిరాడు. అప్పుడు శివుడు రౌద్రంగా మారి యముడిని పాదాలతో తొక్కిపెడతాడు.
యముడు వేడుకోవడంతో శివయ్య వదిలేశాడు. అప్పుడు మార్కండేయుడిని చిరంజీవిగా జీవించమని శివుడు వరమిచ్చాడు. ఇక అమృతఘటేశ్వరుడి ఆలయం చోళ వాస్తు రీతిలో 11 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మితమైంది. ఈ ఆలయప్రాంగణంలో పలు గోపురాలు, మండపాలు, అనేక కళారీతులు భక్తులను కట్టిపడేస్తాయి. ఆసక్తికరంగా ఈ ఆలయంలో కొన్ని పుష్కరిణులు ఉంటాయి. ఈ ఆలయం రాజరాజ చోళుడు, కులోత్తుంగ చోళుడి కాలంో ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయం షష్టిపూర్తి వేడుకలకు ప్రసిద్ధి. నిత్యం వందలాది మంది దంపతులు షష్టిపూర్తి వేడుకలను నిర్వహించుకుంటూ ఉంటారు.
