Site icon Bhakthi TV

శరత్ పున్నమి పూజ ఎలా చేయాలి?

శరత్ పున్నమి రోజున చంద్రుడితో పాటు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా పూజించడం వలన ఇంటికి ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. మరి ఈ పూజ ఎలా చేయాలి? ఈ నెల 6న శరత్ పున్నమి. ఈ రోజును ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తరువాత ఇంటిని, పూజ గదిని కూడా శుభ్రపరుచుకోవాలి. అనంతరం పూజ గదిలో ఒక పీటను పెట్టి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహం లేదంటే చిత్ర పటాలను ప్రతిష్టించాలి. అనంతరం ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. లక్ష్మీదేవికి వీలైతే కమలం పువ్వును సమర్పించాలి. అలాగే తెల్లటి స్వీట్స్ ఏవైనా సరే పెట్టి ఒక కన్ను కొబ్బరికాయను సమర్పిస్తే మంచి జరుగుతుంది.

ఇక రాత్రికి మనం ముందుగానే చెప్పుకున్నాం కదా.. బియ్యం, పాలతో పాయసం వండి చంద్రుడికి సమర్పించాలి. దానిని మట్టి పాత్రలో కానీ లేదంటే వెండి పాత్రలో కానీ నింపి చంద్రుడి కాంతి పడే ప్రదేశంలో పెట్టాలి. అనంతరం “ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మీయే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చంద్రుడికి సమర్పించిన పాయసాన్ని దేవుడికి పెట్టి ఆపై దానిని కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. ఇవాళ పేదలకు తమ స్తోమత మేరకు ఏదో ఒకటి దానం చేస్తే మంచిదని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version