
కర్ణాటక జిల్లాలోని మాండ్య పట్టణంలో గల రంగనాథ స్వామి క్షేత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం గౌతమ మహర్షి ఈ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసాడట. గౌతముని తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడట. మహర్షిని ఏ వరం కావాలో కోరుకోమనగా, స్వామిని శయన రూపంలో చూడాలని ఉందని కోరుకున్నాడంట! సరేనన్న స్వామివారు.. శ్రీరంగనాథునిగా అవతరించి గౌతమ మహర్షికి దర్శనమిచ్చాడంట! అనంతరం విశ్రాంతి తీసుకోదలిచాడట. దాని కోసం సరైన ప్రదేశం కోసం వెతుకుతూ కావేరి నది ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాడట.
అక్కడ విశ్రాంతి తీసుకుంటూ అక్కడే వెలసి ఉండిపోయాడు. అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్నం అనే పేరు వచ్చిందని చెబుతారు. అయితే కొన్ని రోజులకు శ్రీ రంగపట్నానికి తిరుమలయ్య అనే విష్ణు భక్తుడు స్థానిక అధికారిగా వచ్చాడు. శ్రీరంగనాథ ఆలయాన్ని తిరుమలయ్య నిర్మించాడు. రంగనాథుడు మొదట ఇక్కడే కొలువు తీరాడు కాబట్టి ఈ క్షేత్రానికి ఆదిరంగ క్షేత్రమని పేరు వచ్చిందని చెబుతారు. అటు తరువాత ఈ క్షేత్రాన్ని హొయసల, విజయనగర రాజులు అభివృద్ది చేశారు. హొయసల రాజైన విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని విశిష్టాద్వైతకర్త అయిన శ్రీ రామానుజాచార్యులకు దానంగా ఇచ్చాడు. దీంతో ఇది అగ్రహారంగా మారింది.
