Site icon Bhakthi TV

ఇంట్లో గణపతి పూజ ఎలా చేసుకోవాలి? ఉద్యాపన ఎలా?

సంకటహర గణపతి పూజను సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే చేయాలని తెలుసుకున్నాం కదా. ఈ రోజున ఆలయాల్లో సూర్యాస్తమయం తరువాత గణపతి హోమం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున వినాయకుడికి గరిక, జిల్లేడు పూలతో చేసిన మాలను సమర్పిస్తారు. ఇలా చేస్తే మనం చేపట్టిన పనుల్లో విఘ్నాలన్నీ తొలగిపోతాయట. ఇక ఇంట్లో పూజ చేసుకునే వారు పూజా మందిరంలో విఘ్నేశ్వరుని ప్రతిష్టించుకుని దీపారాధన చేయాలి. ముందుగా పసుపు గణపతిని షోడశ నామాలతో పూజించిన మీదట లోహంతో తయారు చేసిన వినాయకుడికి అభిషేకం చేయాల్సి ఉంటుంది.

పాలు, పెరుగు, తేనే, ఆవు నెయ్యి, పంచదార వంటి పంచామృతాలతో వినాయకుడికి అభిషేకం చేసి అనంతరం వినాయకుడిని ప్రార్థించుకోవాలి. ఇక వినాయకుడికి నైవేద్యంగా ఆయనకు ఇష్టమైన మోదకాలు, ఉండ్రాళ్లు, అరటిపళ్లు నైవేద్యం పెట్టాలి. దీంతో పూజ పూర్తవుతుంది. సంకష్ట గణపతి వ్రతాన్ని ఇలాగే 5 నుంచి 21 మాసాల పాటు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. చివరగా ఉద్యాపన చేసుకోవచ్చు. ఈ సమయంలో మొదటి మాసంలో వ్రతం ప్రారంభించే సమయంలో బియ్యాన్ని ముడుపు కట్టి ఉంచుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఆ బియ్యాన్ని రవ్వ తయారు చేసుకోవాలి. ఆ రవ్వతో ఉండ్రాళ్ళు తయారు చేసి స్వామికి నివేదించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే అన్ని సంకటాల నుంచి మనకు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో విముక్తి లభిస్తుందట.

Share this post with your friends
Exit mobile version