Ugadi Rasi Phalalu 2026-27: పరాభవ నామ సంవత్సరంలో మీ రాశికి ఎలా ఉండబోతోంది?
మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :
ఆదాయం -11 వ్యయం – 05
రాజపూజ్యం – 02 అవమానం – 04
50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం అధికం, వ్యయం స్వల్పంగా ఉన్నది కాబట్టి ఆర్థిక అంశాలు బాగుంటాయి. రాజపూజ్యం కంటే అవమానం అధికం కాబట్టి మాటవిలువని కాపాడుకోవాలి. డిసెంబర్ 6 వరకు లాభ స్థానంలో రాహువు సంచారం కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా మంచి వెసులుబాటును కల్పిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం, దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రణాళికలు నెరవేరుతాయి. ఆ తరువాత రాహువు రాజ్యస్థానంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలోఅఖండమైన విజయాలు సిద్ధిస్తాయి. పదోన్నతులు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. లాభాలు గడిస్తారు. గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రమోషన్లు, వేతనం పెరుగుదల, సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అదృష్ట యోగం సూచితం. అయితే, శని వల్ల ఆదాయంతోపాటు ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశం లేదా దూరప్రదేశ ప్రయాణాలు ఉంటాయి. గృహ అవసరాలకు ఖర్చుపెరిగే సూచనలున్నాయి. గురుబలం వల్ల అక్టోబర్ చివరలో అదృష్టవంతులు అవుతారు. గృహ, వాహనయోగాలు బలపడతాయి. విద్యార్థులకు, ఉద్యోగులకు ద్వితీయార్ధం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కేతువు ప్రభావం వల్ల పిల్లల చదువుల పట్ల శ్రద్ధ పెంచాలి. తల్లి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దగ్గరివారితో మనస్పర్ధలు రాకుండా సౌమ్యంగా సంభాషించాలి. వాహనాలకు సంబంధించిన సమస్యలు, స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు. కొత్తపెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్నేహితులు ఆదుకుంటారు.
పరిహారం : వేంకటేశ్వర స్వామి వారి దర్శనం మేలుచేస్తుంది.
వృషభరాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) :
ఆదాయం – 05 వ్యయం – 14
రాజపూజ్యం – 05 అవమానం – 04
100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉంది కాబట్టి, ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్యం చాలా బాగుంది. కాబట్టి గౌరవం పెరుగుతుంది. ఈ సంవత్సరం రాజయోగం అని చెప్పవచ్చు. సంవత్సరమంతా శని భగవానుడు లాభ స్థానంలో సంచరించడం, రాహువు రాజ్య స్థానంలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అఖండమైన విజయాలు సిద్ధిస్తాయి. పదోన్నతులు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా అనిపిస్తుంది. లాభాలు గడిస్తారు. గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రమోషన్లు, వేతనం పెరుగుదల, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్ట యోగం సూచితం. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంవత్సరం ఆరంభంలో గురుబలం వల్ల ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వాక్చాతుర్యంతో పనులు చక్కబెడతారు. అయితే జూన్ నుండి చిన్నపాటి ప్రయాణాలు, పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ తర్వాత కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. గృహంలో అశాంతి లేదా ప్రయాణం మధ్యలో వాహనాలకు సంబంధించిన సమస్యలు, స్వల్ప ఆటంకాలు ఉండవచ్చు, దగ్గరివారితో మనస్పర్ధలు రాకుండా సౌమ్యంగా సంభాషించాలి. మీ ధైర్యసాహసాలు పెరుగుతాయి. స్వయంకృషితో పైకి వస్తారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణిస్తారు. మొత్తం మీద ఇది మీకు ఆర్థికంగా, వృత్తిపరంగా స్వర్ణయుగం. శ్రమకు తగిన ప్రతిఫలంతో కూడిన కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. గృహంలో శాంతి లభిస్తుంది.
పరిహారం : అన్నదానం, శివాభిషేకం
మిథునరాశి (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) :
ఆదాయం – 08 వ్యయం – 11
రాజపూజ్యం – 01 అవమానం – 07
50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉన్నప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. సంవత్సరం ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ, జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది ఆశయాలు నెరవేరుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జూన్ 2 వరకు మానసిక ఆందోళన, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడకుండా చూసుకోవాలి. గురుబలం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. శని సంచారం వల్ల వృత్తి జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా సకాలంలో కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా గుర్తింపు లభిస్తుంది. పనిభారం ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం ఉంటుంది. రాహువు భాగ్యంలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. కేతువు ప్రభావం వల్ల స్వయంకృషితో పైకి వస్తారు. డిసెంబర్ 7 నుండి ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి అడుగువేయడం మంచిది. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు జరుగుతుంది. ఆస్తులను వృద్ధి చేసుకొనే క్రమంలో విజయాలు సాధిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది.
పరిహారం : విష్ణు సహస్రపారాయణ, గణపతి ఆరాధన
కర్కాటకరాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) :
ఆదాయం – 02 వ్యయం – 11
రాజపూజ్యం – 04 అవమానం – 07
25% అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ఆదాయం, ఖర్చు అధికం కాబట్టి సరైన ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేయాలి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉన్నది. గౌరవాన్ని కాపాడుకుంటూ ఫలితాలు రాబట్టాలి. శని భాగ్యంలో సంచరించడం వల్ల అదృష్టం కొంత మందగించినట్లు అనిపించినా, కష్టపడితే ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆశ్రద్ద వహించవద్దు. బాధ్యతాయుతంగా పనిచేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలను పొందవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి శని అనుకూలిస్తాడు. రాహువు అష్టమంలో ఉండటం వల్ల ఆరోగ్యం విషయంలో, వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. రాహువు సప్తమ సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో, వైవాహిక జీవితంలో చిన్నపాటి పొరపొచ్చాలు రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. జూన్ 2 నుండి ఆత్మ విమర్శ చాలా అవసరం. ఆలోచించి ముందుకు సాగటం ద్వారా భవిష్యత్తు సుగమమవుతుంది. గురువు అనుగ్రహం వల్ల మీ ఆలోచనలు పరిణితి చెందుతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. దైవానుగ్రహం రక్షిస్తుంది. కేతువు ద్వితీయంలో ఉండటం వల్ల మాట్లాడేటప్పుడు జాగ్రత్తపడాలి. సున్నితంగా సంభాషించాలి. ఆర్థిక లావాదేవీలలో ఆచితూచి అడుగువేయడం మంచిది. అక్టోబర్ 31 తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊరట కలుగుతుంది. రుణ సమస్యలు తొలగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. అదృష్టవంతులు అవుతారు. మొదటినుంచి చేసిన శ్రమ ఫలిస్తుంది.
పరిహారం : శివాభిషేకం చేయడం, గురు శ్లోక పఠనం.
సింహరాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :
ఆదాయం – 05 వ్యయం – 05
రాజపూజ్యం – 07 అవమానం – 07
50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా సమంగా ఉన్నాయి కాబట్టి, ఫలితాలు ప్రయత్నాన్ని బట్టి ఉంటాయి. కొంత ఓర్పు, సహనం అవసరం. సంవత్సరమంతా అష్టమ శని ప్రభావం ఉన్నందున పనులలో జాప్యం, వృత్తిపరమైన ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. జూన్ 2 వరకు గురువు లాభ స్థానంలో ఉండటం మీకు పెద్ద రక్షాకవచంలా గురు బలం రక్షిస్తూ ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో దైవ బలం సహకరిస్తుంది. సమష్టిగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్వార్ధం బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా సంవత్సరం ప్రథమార్ధంలో ఆర్థికంగా బలపడతారు. నిలవ చేసిన ధనము అక్కరకు వస్తుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్నిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో, వైవాహిక జీవితంలో చిన్నపాటి పొరపొచ్చాలు రావచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, ఋణ సమస్యల నుండి బయటపడతారు. ఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసే పనులు గుర్తింపునిస్తాయి.
పరిహారం : శనికి తైలాభిషేకం, హనుమాన్ చాలీసా పఠనం.
కన్యారాశి (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :
ఆదాయం – 08 వ్యయం – 11
రాజపూజ్యం – 03 అవమానం – 03
75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం బాగానే ఉన్నది కానీ, ఖర్చు కొంచెం ఎక్కువగా కనబడుతోంది. మంచి విషయాలకై ధనాన్ని వెచ్చించండి. రాజపూజ్య అవమానాలు సమంగా ఉన్నాయి. కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాహువు షష్ఠంలో సంచరించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, ఋణ సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో చేసే పనులు గుర్తింపునిస్తాయి.. ప్రతిభతో పెద్దలను మెప్పించి ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. గృహ నిర్మాణాది విషయాలలో కలిసి వస్తుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ధర్మబద్ధంగా ప్రయత్నం కొనసాగాలి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. విదేశీ యోగాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయత్నం బాగా చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. రాహువు పంచమంలో ఉన్నప్పుడు సంతానం విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. శని సప్తమంలో సంచరించడం వల్ల వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కానీ, భాగస్వాములతో గొడవలకు తావివ్వకూడదు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గుర్తింపును సాధించే సమయం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన లాభం, పదోన్నతులు, పెద్దలు పరిచయాలు కలుగుతాయి. అక్టోబర్ తర్వాత శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ద్వాదశ కేతువు మానసిక చైతన్యాన్ని తగ్గించే అవకాశం ఉన్నది కాబట్టి ఎప్పుడూ ఉత్సాహంగా ఆలోచించండి. ఊహించని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. దైవ బలం రక్షిస్తుంది.
పరిహారం: గణపతి ఆరాధన, శివపూజ
తులారాశి (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు) :
ఆదాయం – 05 వ్యయం – 14
రాజపూజ్యం – 06 అవమానం – 03
100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి, ఆర్థికపరంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. రాజపూజ్యం అధికం. గౌరవం హోదా ఉన్నత స్థితి కలుగుతుంది. శని సంచారం వల్ల తిరుగులేని విజయాలు లభిస్తాయి. శ్రేష్ఠమైన ఫలితాలని చవిచూస్తారు. ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. విరోధులు మిత్రులుగా మారతారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజయోగం సూచితం. తగినంత గుర్తింపుని సాధిస్తారు. మీ కృషి ఫలిస్తుంది . జీవితాన్ని మలుపు తిప్పే మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. జూన్ 2 వరకు తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. విదేశీ యానానికి, ఉన్నత విద్యకు ఇది స్వర్ణ సమయం. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. సకాలంలో ఏకాగ్రతతో పని చేయటం చాలా అవసరం. కేతువు వల్ల ఆధ్యాత్మిక మార్గాల ద్వారా లేదా ఊహించని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. దైవ బలం రక్షిస్తుంది. ప్రశాంతత లభిస్తుంది. వృత్తి పరంగా పనిలో నిబద్దత ఉంటుంది. కానీ గుర్తింపు ఆలస్యం కావచ్చు. రాహువు వల్ల సంతానం విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించవచ్చు, పిల్లల చదువుల విషయంలో ఏకాగ్రతను పెంచాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అక్టోబర్ తర్వాత సానుకూల పరిస్థితులు ఉంటాయి ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. శుభాలు జరుగుతాయి. ఎంత శ్రమ చేస్తే అంతకు రెట్టింపు ఫలితం అందుతుంది.
పరిహారం : దత్తాత్రేయ స్తోత్రం, గురు చరిత్ర పారాయణం.
వృశ్చికరాశి (విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ) :
ఆదాయం – 11 వ్యయం – 05
రాజపూజ్యం – 02 అవమానం – 06
75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన ఆదాయం ఉంది. స్వల్పంగా ఖర్చు గోచరిస్తోంది. ఆర్థికంగా బాగుంటుంది. అవమానం అధికంగా ఉంది. కాబట్టి సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ బలం సదా కాపాడుతుంది. మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఫలితాలు ఉంటాయి. బాధ్యతాయుతంగా సకాలంలో పనులు మొదలు పెట్టండి. సరైన ప్రణాళికలు శక్తిని ప్రసాదిస్తాయి. జూన్ 2 వరకు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. జూన్ 2 నుండి గురుబలం వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది. అప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఎటుచూచినా విజయమే గోచరిస్తుంది. కుటుంబ పరంగా పెద్దల నుండి సహాయ సహకారాలు. అందుతాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయం. దైవ దర్శనాలు చేసుకునే వీలు కలుగుతుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. శని పంచమంలోఉండటం, రాహువు చతుర్ధంలో ఉండటం వల్ల గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించవచ్చు. పిల్లల చదువుల విషయంలో ఏకాగ్రతను పెంచాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. రాహువు తృతీయంలోకి వచ్చే సమయం మీకు కొండంత అండ. మీ ధైర్యం, చొరవతో సమస్యలను అధిగమించి కార్యసిద్ధిని పొందుతారు. కేతువు వల్ల వృత్తి పరంగా పనిలో నిబద్దత ఉంటుంది. కానీ గుర్తింపు ఆలస్యం కావచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు రాకుండా చూసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది సరైన సమయం కాదు. జూన్ నుండి అక్టోబర్ వరకు ఉన్న సమయం చాలా కీలకం. ఈ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో, వృత్తిలో తగినంత ప్రతిఫలం లభిస్తుంది.
పరిహారం : శివాలయ దర్శనం, శనివారం రాహు ధ్యానం.
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) :
ఆదాయం – 14 వ్యయం -11
రాజపూజ్యం – 05 అవమానం – 06
75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. అత్యద్భుతమైన ఆదాయం ఉన్నది. ఆదాయం కంటే ఖర్చు తక్కువ. ధన లాభం బాగుంటుంది. రాజపూజ్య అవమానాలు ఇంచుమించు సమంగా ఉన్నాయి. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అనుకూల గురుబలం వల్ల సంవత్సర ప్రారంభం, చివరి భాగం అద్భుతంగా ఉంటుంది. మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా శుభ ఫలితాలు ఉంటాయి. అర్ధాష్టమ శని వల్ల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత లోపించకుండా తగు ప్రయత్నం చేయాలి. పని ఒత్తిడి వల్ల విసుగు చెందకుండా సహనంతో వ్యవహరించాలి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. అయితే, రాహువు తృతీయంలో ఉండటం మీకు కొండంత అండ. మీ ధైర్యం, చొరవతో సమస్యలను అధిగమించి కార్యసిద్ధిని పొందుతారు. శాంతంగా సంభాషించాలి. ఒత్తిడికి గురి కావద్దు. అకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 2 వరకు గురువు సప్తమంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. జూన్ నుండి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఏకాగ్రతతో బాధ్యతలని జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అక్టోబర్ 31 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. భాగ్య బృహస్పతి సిరిసంపదలు వృద్ధిచేస్తారు. ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. ఆధ్యాత్మికంగా దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది. పూర్వపుణ్యం కాపాడుతుంది.
పరిహారం : దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠనం.
మకరరాశి (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :
ఆదాయం – 02 వ్యయం – 08
రాజపూజ్యం – 01 అవమానం – 02
50% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం అత్యల్పం, వ్యయం అధికంగా ఉంది. కాబట్టి ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజపూజ్య అవమానాలు అత్యల్పంగా ఉన్నందువల్ల ఎటువంటి సమస్య రాదు. శని సంచారం వల్ల అద్భుతమైన పురోగతి ఉంటుంది. గత కొన్నేళ్లుగా పడిన కష్టాలకు ఇది పరిష్కార సమయం. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించడం ద్వారా తగిన గుర్తింపు ఉంటుంది. తగినంత సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు వివాహానికి అనుకూల సమయం. వ్యాపారస్తులకు లాభాలు సమయం. గురు బలం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపు విద్యాయోగం లభిస్తుంది. సంపూర్ణ జ్ఞాన ప్రకాశంతో పరిశోధనాపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ప్రస్తుత సమాజానికి తగిన విధంగా విజ్ఞానాన్ని పొందుతారు. ఆదాయ వనరులు సమకూరుతాయి. బుద్ధి బలాన్ని ఉపయోగించటం ద్వారా అధిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆస్తిని పెంపొందించుకునే వీలు కలుగుతుంది. వాగ్దానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక మానసిక అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైరాగ్య ధోరణితో కూడిన ఆలోచనలకు దూరంగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది సరైన సమయం కాదు. సమస్యలు రాకుండా వ్యవహరించాలి. పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిది. కొత్త అప్పులు చేయవలసిన స్థితి రాకుండా ముందుగానే ఆలోచించాలి. స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాహస కార్యాలు విజయాన్నిస్తాయి.
పరిహారం : గణపతికి గరికతో పూజ, దుర్గా స్తోత్రం చదువుకోవటం.
కుంభరాశి (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు) :
ఆదాయం – 02 వ్యయం – 08
రాజపూజ్యం – 04 అవమానం – 02
75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం అత్యల్పం, వ్యయం అధికంగా ఉంది కాబట్టి, ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అవమానాలు అత్యల్పంగా ఉన్నందువల్ల ఎటువంటి సమస్య రాదు. రాజపూజ్యం చాలా బాగుంది, కానీ బాగా కష్టపడాలి. ఏలినాటి శని కారణంగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ సమయస్పూర్తితో ముందుకు సాగాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేయాలి. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని సందర్భాలలో పనులు నిదానంగా సాగుతాయి. జూన్ 2 వరకు గురుబలం వల్ల దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించి విజయాలు సాధిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రతిభతో పని చేస్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. జూన్ నుండి రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. నిరుత్సాహం చెందకుండా కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించాలి. శారీరక మానసిక అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమి, దూర ప్రదేశ ప్రయాణాలు, వృథా ఖర్చులు ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు తగ్గించటం మంచిది. శత్రువులపై విజయం సాధిస్తారు. అక్టోబర్ తర్వాత ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సమస్త విఘ్నాలు తొలగి సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం మారకపోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి.
పరిహారం : ఆంజనేయ స్వామి ఆరాధన
మీనరాశి (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) :
ఆదాయం – 14 వ్యయం – 11
రాజపూజ్యం – 07 అవమానం – 02
75% అనుకూల ఫలితాలు ఉన్నాయి. అత్యద్భుతమైన ఆదాయం ఉన్నది. ఆదాయం కంటే ఖర్చు తక్కువ. ధనలాభం బాగుంటుంది. రాజపూజ్యం శుభప్రదంగా ఉంది. అవమానం అత్యల్పం. కాబట్టి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏలినాటి శని మొదటి దశలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక శక్తి లోపించకుండా ఆలోచించాలి. దేనికి నిరుత్సాహం చెందవద్దు. ధైర్యంగా ధర్మమార్గంలో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేయాలి. మానసిక శక్తి కార్యశక్తిని ప్రసాదిస్తుంది. నిద్రలేమి, దూర ప్రదేశ ప్రయాణాలు, వృథా ఖర్చులు ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు తగ్గించటం మంచిది. అయితే, ముఖ్య కార్యక్రమాలలో భయపడాల్సిన అవసరం లేదు. లాభస్థానంలో రాహువు సంచారం. కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తారు. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం, దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రణాళికలు నెరవేరుతాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు వరదాయకమైన కాలం. పలుమార్గాలలో విజయాలు సొంతమవుతాయి. ఎంత ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపు శుభ ఫలితాలు అందుతాయి. సంతానాభివృద్ధి ఉంటుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి ఇది అనుకూలమైన సమయం. సంవత్సరం చివరి భాగంలో గురుబలం తగ్గుతుంది ఆ సమయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ, మీ పనితనం వల్ల అభ్యున్నతిని సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
పరిహారం : విష్ణు ఆలయ సందర్శన

