
వరలక్ష్మీ వ్రతం పూర్ణిమ ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్ట్ 1 శుక్రవారం చేసుకోవాలా ? లేదంటు ఆగస్ట్ 8వ తేదీ.. శుక్రవారం చేసుకోవాలా? అన్న సందేహం చాలామందికి కలిగింది. దానికి పరిష్కారంగా చాలామంది పంచాంగ కర్తలు ఆగస్ట్ 8వ తేదీని పూర్ణిమ అయినా ఆవేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణమూ, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక కొందరు ప్రముఖ పండితులు 8వ తేదీనే జరపాలని నిర్ణయించారు.
వ్రతనిర్ణయ కల్పవల్లి అన్న గ్రంథంలో
శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే
వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్
అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పబడింది కావున మంచి సంపదా , మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పూర్ణిమకి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది.
వివరణ వాక్యం
యది పూర్ణమాయామేవ భృగువార
స్సంభవతి తస్మిన్నేవ దినే వరలక్ష్మీ వ్రతం కార్యమ్
అని వివరణ కూడా వ్రతకల్పవల్లీ గ్రంథం లో చెప్పబడింది. అనగా ఒకవేళ పూర్ణిమ రోజునే శుక్రవారం వస్తే ఏంచెయ్యాలి ? అన్నప్రశ్న వస్తే ఆరోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అని అర్థం.
