Site icon Bhakthi TV

భీమేశ్వరాలయ స్థల పురాణం ఏంటంటే..

కుమార భీమేశ్వరాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ ఆలయంలో స్వయంగా కుమారస్వామి రెండు అంతస్తులలో స్ఫటిక లింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి దానిని కుమారాలయం అని పిలుస్తారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేశాడు. తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదించాడట. అలాగే శివుడి నుంచి తారకాసురుడు మరో వరాన్ని కూడా పొందాడు. అదేంటంటే.. ఒక్క బాలుని చేతిలో తప్ప మరెవరి చేతిలో మరణం లేని విధంగా వరం అందుకున్నాడు. వరగర్వంలో తారకాసురుని ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఆత్మలింగాన్ని కంఠంలో ఉంచుకుని దేవతలను హింసించసాగాడు. దీంతో దేవలంతా విష్ణుమూర్తిని శరణు వేడారు.

అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో పరమేశ్వరుడి తేజో రూపంతో జన్మించే కుమారుడు తప్ప మరెవ్వరూ తారకాసురున్ని అంతం చేయలేరని చెప్పాడు. దీనికోసం పరమేశ్వరుని ప్రార్థించాలని చెప్పగా దేవతలంతా ఆయనను వేడుకున్నారు. ఈ క్రమంలోనే శుభ ముహూర్తాన శివుడి తేజస్సుతో కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి ఒక రోజు దేవతా గణములతో కలిసి తారకాసురున్ని వధించేందుకు రంగంలోకి దిగుతాడు. అయితే తారకాసురుని వధించాలంటే ఆత్మలింగాన్ని ఛేదించాలని కుమారస్వామి తెలుసుకుంటాడు. తారకాసురుడి కంఠంలోకి బాణాన్ని వదలడంతో ఆత్మలింగం చెల్లాచెదురై తారకాసురుడు మరణిస్తాడు. అప్పుడు ముక్కలైన ఆత్మలింగం భూమిపై పలు ప్రదేశాల్లో పడిందట. ఆ తరువాత కుమారరామంలో కుమారస్వామి 14 అడుగుల ఎత్తులో ఆత్మలింగాన్ని ప్రతిష్టించాడు.

Share this post with your friends
Exit mobile version