అదంతా పూర్తి అసత్యం.. భక్తులు నమ్మకండి: టీటీడీ

ఇటీవలి కాలంలో తిరుమల గురించి ఎన్నో అసత్య వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. తిరుమలోని శ్రీవారి ప్రసాదం లడ్డు, దర్శన ధరలు పెరిగాయని ఒకసారి.. తగ్గాయని మరోసారి తెగ ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇస్తూనే ఉంది. తాజాగా మరో ప్రచారం షురూ అయ్యింది. తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందనేది సదరు ప్రచారం సారాంశం. ఇది మాత్రమే కాకుండా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుంది.

దీనిపై టీటీడీ ఈవో కార్యాలయం స్పందించింది. ఇది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆయన చర్చించింది సేంద్రియ బియ్యం వాడకం విషయం గురించి కాదని.. అసలు వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని వెల్లడించింది. కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారని ఇది పూర్తిగా అవాస్తవమని.. వీటిని నమ్మవద్దని టీటీడీ ఈవో కార్యాలయం వెల్లడించింది.

Share this post with your friends