తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్.. అదేంటంటే ఇకపై తక్కువ ధరలోనే తిరుమలలో మంచి ఆహారం లభించనుంది. సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జె. శ్యామలరావు చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగంవారు అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద మరియు జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి హోటల్‌లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు 5వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం టీటీడీ ఈవో, ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద, జనతా క్యాంటీన్‌లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు, ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సవివరమైన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను అందించారు. ఇందులో తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు మరియు తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పద్ధతులు తెలిపారు. ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక-రసాయన-జీవ ప్రమాదాలు, ముడి సరుకులు నిల్వ చేసే పద్ధతులు, వృధా నిర్మూలన ప్రణాళిక, ఆహార భద్రత చట్టాలు మరియు చట్టాలలో ఉల్లంఘన శిక్షలు తెలియజేశారు. ఆహార వ్యాపార నిర్వాహకులకు చాలా అవసరమైన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) శిక్షణా సంబంధిత విషయాలు వివరించారు. ఈ సమావేశంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు శ్రీమతి ఆశాజ్యోతి, శ్రీమతి విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ ఆరోగ్యశాఖ అధికారి డా. సునీల్ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ జీఎల్‌ఎన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.