నేడు ముత్యాల కవచ ధారణలో శ్రీ మలయప్ప స్వామి..

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ ఈ ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారికి ముత్యాల కవచ సమర్పణ చేశారు. స్వామివారిని ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా భక్తులకు ఓ ముఖ్య గమనిక ఏంటంటే.. శ్రీవారి ఆలయంలో రేపు క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను మాత్రం నిర్వహిస్తుంది కానీ ఏకాంతంగా నిర్వహించనుంది. జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి ఏడాది మూడు రోజుల‌ పాటు మలయప్ప స్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

తరతరాలుగా స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నిన్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న ఉదయం దయం ఋత్వికులు శాంతిహోమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు రకాల కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మాడ వీధుల్లో ఊరేగించారు.

Share this post with your friends