తిరుమల శ్రీవారి స్థానిక భక్తులకు బిగ్ అలర్ట్..

ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన ఏర్పాట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరి 07న తొలి మంగళవారం కాబట్టి ఆ రోజున స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కల్పించనుంది. స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జనవరి 5 ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ మేరకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు కాబట్టి స్థానికులంతా ఆయా కేంద్రాలను సంప్రదించాలని టీటీడీ కోరింది.

కాగా.. నేడు తిరుమలలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. సర్వసాధారణంగా వీకెండ్స్‌లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. కానీ ఈ శనివారం నుంచి కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా స్వామివారి దర్శనానికి భక్తులను పంపిస్తున్నారు. మరో ఐదు రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానుండటంతో దానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే ఈ వీకెండ్‌లో భక్తుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు భావిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను దాదాపుగా అధికారులు పూర్తి చేశారు.

Share this post with your friends