ఈ స్వామివారిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టేనట..

దత్తాత్రేయ స్వామివారిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా గురువారం స్వామివారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. ఇవాళ స్వామివారిని పూజిస్తే ఆయన అనుగ్రహాన్ని తప్పక పొందుతామట. అత్రి మహర్షి నియమబద్దత, అనసూయ మాత పాతివ్రత్యం పట్ల ముగ్దులైన త్రిమూర్తులు వారికి వరమిచ్చారట. త్రిమూర్తుల వరంగా జన్మించాడు కాబట్టి దత్త అని.. అత్రి మహర్షి సంతానం కాబట్టి ‘ఆత్రేయ’ అని రెండూ కలిపి దత్తాత్రేయ స్వామి అయ్యాడు. కటిక బ్రహ్మచారి అయిన ఆయన మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూలం ఆయుధాలు ధరించి ఉంటాడు. ఆయన వెంట ఎప్పుడూ నాలుగు శునకాలు, గోమాత ఉంటుంది. దత్తాత్రేయ స్వామివారిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టేనట.

స్వామివారి వెంట ఉండే గోమాతను గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు.. నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు. ఇక గురువారం నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి శుచిగా స్నానం చేసి స్వామివారి విగ్రహానికి గంధంతో బొట్టు పెట్టాలి. అయితే స్వామివారి పూజకు వినియోగించే పువ్వులు వివిధ రకాలు ఉండాలి. వాటితో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. ఇంకా సమయం కాస్త కేటాయించగలిగితే దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్ర కవచం కానీ పఠించాలి. ఇది కానీ పఠించారో ఎంతటి అనారోగ్య సమస్య అయినా ఇట్టే నయమవుతుందట. పూజ పూర్తి అయ్యాక స్వామివారికి నైవేద్యంగా కూడా పసుపు రంగులో ఉండే ఆహారాన్నే సమర్పించాలి. పండ్లైనా కూడా పసుపు రంగులో ఉండేవే నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి గురువారం ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుందట.

Share this post with your friends