నిర్జల ఏకాదశిని భీముని ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు?

ఇవాళ నిర్జల ఏకాదశి. ఏడాది మొత్తం ఉపవాసం చేయకున్నా.. ఈ ఒక్కరోజు చేస్తే అంతటి ప్రతిఫలం దక్కుతుందట. అయితే ఈ ఉపవాసం అత్యంత కఠినంగా ఉంటుంది. కనీసం నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. మరి ఈ నిర్జల ఏకాదశి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందంటారా? తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ శుక్ల ఏకాదశి 17వ తేదీ తెల్లవారుఝామున 4:47 నిమిషాలకు ప్రారంభమై 18వ తేదీ ఉదయం 6:24 వరకు కొనసాగుతుంది. ఈ లెక్కన ఇవాళే నిర్జల ఏకాదశిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. నిర్జల ఏకాదశికి సంబంధించి ఓ పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. అదేంటంటే.. పాండవులలో రెండవ వాడైన భీముడికి ఆకలెక్కువ.

భోజన ప్రియుడు కాబట్టి భోజనం చేయకుండా ఒక్క పూట కూడా ఉండలేడు. ఈ క్రమంలోనే భీముడు ఒకసారి వ్యాసమహర్షితో తన తల్లి, సోదరులు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారని తాను అలా నెలకు రెండు రోజుల పాటు ఉపవాసముండలేనని.. మోక్షాన్ని పొందేందుకు సంవత్సరానికి ఒక్కరోజే ఉపవాసం ఉంటానని కాబట్టి అలాంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ప్రాథేయపడ్డాడు. అప్పుడు వ్యాసుడు భీముడికి అలా చేసే ఉపవాసం గురించి వివరించాడట. జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఆహారం మాత్రమే కాకుండా కనీసం జలం కూడా తీసుకోకుండా నిష్టగా ఉపవాసం చేయాలని సూచించాడట. ఆపై మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం ఇతర దానాలు విరివిగా చేస్తే మోక్షం లభిస్తుందని వెల్లడించాడు. అలాచేసి భీముడు మోక్షాన్ని పొందాడట. కాబట్టి ఈ రోజును నిర్జల ఏకాదశి అని మాత్రమే కాకుండా భీముని ఏకాదశి అని.. పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

Share this post with your friends