పిల్లలు లేని దంపతులు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామివారిని పూజిస్తూ ఉంటారు. దీనికి కారణమేంటన్న సందేహం కొంతమందికి కలుగుతుంది. దానికి ఓ కథ ఉంది. ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలసానికి వచ్చారట. అలా వెళ్లిన వారిలో దిగంబర ఋషులు కూడా ఉన్నారట. వారిని చూసి సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దీంతో ఆగ్రహించిన పార్వతిదేవి పుత్రుని మందలించింది. ఆపై సుబ్రహ్మణ్య స్వామికి అర్థమయ్యేలా.. మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవని.. జాతికి జన్మస్థానాలు అని తెలియ చెప్పిందట.
తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి కొంతకాలం పాటు సర్పరూపం దాల్చాడట. ఆ తరువాత క్రమక్రమంగా వాటికి అధిపతి అయ్యాడు. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. అందువల్లే జీవకణాలకు అధిపతి అయిన సుబ్రమణ్యస్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం. కుమారస్వామి జన్మించిన విధానాన్ని బట్టి ఆయనకి అనేక నామాలున్నాయి. కుమారస్వామి కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి, మరికొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా.. మరికొన్ని చోట్ల శక్తి ఆయుధాన్ని ధరించిన బాలుడిగానూ కనిపిస్తాడు. సంతాన భాగ్యం లేనివారు ఏమైనా సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి సంతాన భాగ్యం కలుగుతుందట.