ఇందిరా ఏకాదశి పూజా విధానం ఏంటంటే..

ఈ నెల 28న మనం ఇందిరా ఏకాదశిని జరుపుకోబోతున్నామని ముందుగానే తెలుసుకున్నాం. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించుకుంటే మనకు చాలా మంచిది. అసలు ఇందిరా ఏకాదశి పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. ఇందిరా ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం పూజ గదిని శుభ్రం చేసి ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ చిత్ర పటాన్ని కానీ ప్రతిష్టించుకోవాలి. విష్ణుమూర్తి ముందు నెయ్యి దీపం వెలిగించి.. ఉపవాస వ్రత దీక్ష చేపట్టాల్సి ఉంటుంది. పసుపు విష్ణుమూర్తి చాలా ఇష్టమైనది కాబట్టి స్వామివారికి పసుపు పూలు సమర్పించండి.

అనంతరం స్వామివారికి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. విష్ణుమూర్తికి నైవేద్యంగా పండ్లు, స్వీట్లు లేదా సాత్విక ఆహారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఇందిరా ఏకాదశి వృత్తాంతాన్ని పఠించాలి. ఆపై విష్ణుమూర్తికి హారతి ఇస్తే పూజ పూర్తైనట్టే. పూజానంతరం ప్రసాదం మీరు తిని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పంచండి.ఇక ఇందిరా ఏకాదశి నాడు ఒక మంత్రం పఠిస్తే చాలా మంచి జరుగుతుందట. జాతక దోషం ఉన్నవారెవరైనా ఇందిరా ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఎదుట కూర్చొని 21 సార్లు నవగ్రహ స్తోత్రం పఠిస్తే గ్రహాలను శాంతింపజేస్తుందట. అన్ని దోషాలూ తొలగిపోతాయని నమ్మకం.

Share this post with your friends