ఒకసారి అర్జనుడు మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలోని కైలాస-పహర్‌ఘర్ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొండలలో కొలువైన కులదేవత విగ్రహాన్ని పాండవులు ప్రతిష్టించారని తెలుసుకున్నాం. వనదేవత భవానీ ఆలయంలోని అమ్మవారిని భరరేవాలి మాతగా పిలుస్తారు. అసలు ఈ అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం వెనుక కథేంటంటే.. పాండవులు అజ్ఞాతవాస సమయంలో అమ్మవారిని పూజించేవారట. అర్జనుడి పూజకు సంతోషించిన అమ్మవారు.. ఆయనతో ‘అర్జునా నీకు ఎలాంటి వధువు కావాలో కోరుకో’ అని అడిగిందట. దీనికి అర్జనుడు తనకు ఎలాంటి వరమూ అక్కర్లేదని తెలిపాడు.
తనసలు పెళ్లి కావాలనే కోరికతో తాను పూజించలేదని.. 12 సంవత్సరాల వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం గడిపే సమయంలో తమతో ఉంటూ తమను కాపాడాలని అమ్మవారిని అర్జనుడు వేడుకున్నాడట. అప్పుడు అమ్మవారు.. ‘నువ్వెప్పుడు ముందుంటావు.. నీ వెనుక నేనుంటాను. ఎప్పుడైనా నువ్వు నన్ను చూడాలని వెనక్కు తిరిగితే నేనక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటాను’ అని చెప్పిందట. దీనికి సరేనన్న అర్జనుడు.. అరణ్యంలో చాలా సేపు తిరిగి తన నగర రహదారికి చేరుకున్నాడు. అక్కడ అమ్మవారు పెట్టిన కండిషన్ మరచి.. తన వెనుక ఉందా.. లేదా? అని వెనుదిరిగి చూశాడట. అంతే వెంటనే అమ్మవారు అక్కడే ఉన్న రాతిలోకి ప్రవేశించిందట. వెంటనే కులదేవతను అర్జనుడు వేడుకున్నా అమ్మవారు శిలలోనే కొలువై ఉంటానని చెప్పిందట. ఇదీ భరరేవాలి అమ్మవారి కథ.