సర్వదర్శనం క్యూ లైన్‌లోనూ అన్ని వసతులు కల్పిస్తోన్న టీటీడీ

ఏపీలో కొలువైన కొత్త ప్రభుత్వం తిరుమలపై ఫోకస్ పెట్టింది. టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల క్షేత్రానికి భక్తులు లక్షల్లో నిత్యం వస్తుంటారు. గోవింద నామ స్మరణే వినిపించాలంటూ సీఎం చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామల రావుకు బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు, సమీక్షలతో మార్పులకు ఈఓ కృషి చేస్తున్నారు. పారిశుధ్యం నుంచి భక్తుల కోసం మాఢ వీధుల్లో కూల్ పెయింట్ వేయించడం.. లడ్డూలో నాణ్యత దిశగా అడుగులు వేయడం వంటివి చేస్తున్నారు.

కాలినడక భక్తుల దర్శనానికి సైతం ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తున్నారు. సాధారణ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా శ్రీవారి నైవేద్య సమయం లోపే వీఐపీ బ్రేక్ దర్శనాలకు ముగింపు పలికేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక సర్వదర్శనం క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయి రోడ్డు పక్కన ఉండే క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా మంచినీటితో పాటు అన్నదానం, ప్రాథమిక వైద్య సదుపాయం వంటివి కల్పిస్తున్నారు.

Share this post with your friends