ఇవాళ ఖతు శ్యామ్ జీ జన్మదినం.. శ్రీకృష్ణుడికే వరమిచ్చిన ఈయన కథ తెలుసుకోవాల్సిందే..

ఇవాళ శ్రీ ఖతు శ్యామ్ జీ జన్మదినం. కలియుగంలో ఈయనను శ్రీ కృష్ణ పరమాత్ముని అవతారంగా భావిస్తారు. శ్రీ ఖతు శ్యామ్ జీ ఆలయం రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో ఉంది. ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. సౌత్ ఇండియాకు ఖతు శ్యామ్ జీ పెద్దగా తెలియక పోయి ఉండవచ్చు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు భక్తులు ఉన్నారు. అయితే ఇవాళ స్వామివారి పుట్టినరోజు కావడంతో ప్రత్యేక కార్యక్రమాలను ఆలయ సిబ్బంది నిర్వహించనుంది. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్ల క్రితం నిర్మితమైంది. అనంతరం1720లో అభయ్ సింగ్ జీ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.

అసలు ఎవరీ ఖతు శ్యామ్ జీ?

భీముని మనవడు, ఘటోత్కచుని ముగ్గురు కుమారులలో పెద్దవాడు బార్బరిక్. యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు. తల్లి, శ్రీకృష్ణుడి నుంచి యుద్ధ కళలు నేర్చుకున్నాడు. అనంతరం తపస్సు చేసి మహదేవ్‌ని మెప్పించి మూడు బాణాలను వరంగా పొందాడు. కురుక్షేత్ర యుద్ధం జరగనున్న విషయం తెలుసుకున్న బార్బరిక్ తాను యుద్ధంలో పాల్గొనాలని భావించాడు. తల్లిని అనుమతి కోరి.. యుద్ధంలో ఓడిపోయే వారి పక్షాన నిలిచేందుకు బయలుదేరాడు. అయితే ఆ మూడు బాణాలను బార్బరిక్ సంధిస్తే ప్రపంచం వినాశనమవుతుంది. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు బ్రహ్మణ వేషంలో వెళ్లి బార్బరిక్‌ను అడ్డుకుంటాడు. అతన్ని మాటల్లో పెట్టి.. రెచ్చగొట్టి తనకు ఓ దానం కావాలని అడుగుతాడు. ఏంటో చెప్పమన్న బార్బరిక్‌కు నీ తల వరంగా కావాలని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆశ్చర్యపోయిన బార్బరిక్.. ఇచ్చిన మాటకు కట్టుబడి తన తలను నరుక్కుంటాడు. బార్బరిక్ త్యాగానికి సంతోషించిన శ్రీకృష్ణుడు.. కలియుగంలో తన పేరు శ్యామ్‌తోక్ పూజించబడతావని వరం ఇచ్చాడు. కాబట్టి బర్బర్ ప్రస్తుతం ఖతు శ్యామ్ జీగా పూజలందుకుంటున్నాడు.

Share this post with your friends