గుప్త నవరాత్రులలో చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటంటే…

నవరాత్రులకు హిందూమతంలో చాలా ప్రత్యేకత ఉంది. ఏడాదికి నాలుగు సార్లు జరుపుకునే ఈ నవరాత్రులను ఆషాఢ మాసంలోనూ గుప్త నవరాత్రుల పేరిట జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది గుప్త నవరాత్రులు ఆషాఢ మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే ఈ నెల 6 నుంచి అన్నమాట. ఈ గుప్త నవరాత్రులలో దుర్గమ్మను తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటాం. 15వ తేదీన ఈ గుప్త నవరాత్రులు ముగియనున్నాయి. అయితే గుప్త నవరాత్రులలో అత్యంత ముఖ్యమైనది కలశ స్థాపన. నవరాత్రుల ప్రారంభం రోజున ఈ కలశ స్థాపన ఉంటుంది. సకల దేవతలు ఈ కలశంలో కొలువై ఉంటారని నమ్ముతారు కాబట్టి ఎలా పడితే అలా కలశ స్థాపన చేయకూడదు.

కలశ స్థాపనకు కొన్ని కీలక నియమాలున్నాయి. కలశం ఎక్కువగా మట్టితో చేసిన ఉండాలి. ముఖ్యంగా మట్టితో చేసినదైతే మరీ మంచిది. కారణమేంటంటే.. ఈ కలశాన్ని పూజ ముగిసిన తర్వాత నదిలో విడిచిపెడతారు. ఇక కలశంలో కలువ పువ్వులు, గంగాజలం, ఎరుపు రంగు వస్త్రం, అక్షతలు వేసి పైన కొబ్బరికాయను పెట్టి కలశాన్ని ప్రతిష్టించాలి. ఇక కలశాన్ని 6వ తేదీన ఉదయం 5.11 గంటల నుంచి 7.26 మధ్య ప్రతిష్టించాలి. ఒకవేళ ఈ ముహూర్తంలో వీలు పడలేదంటే.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రతిష్టించవచ్చు. ఇక కలశ స్థాపనలో విరిగిన లేదంటే పాడైన.. ఏవైనా మచ్చలు ఉన్న కుండను ఏర్పాటు చేయవద్దు. ఒకసారి కలశాన్ని స్థాపించిన తర్వాత 9 రోజుల పాటు పూజలు చేయాల్సిందేనట..

Share this post with your friends