హిందూ మతంలో ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసానికైతే కాస్తంత ఎక్కువ ప్రత్యేకతే ఉంటుంది. ఈ శ్రావణ మాసం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు.. ఇక ఈ శ్రావణ మాసం కోసం శ్రీశైలం ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 3 వరకూ శ్రావణ మాసోత్సవాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆలయ ఈవో.. అర్చకులు, ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రావణమాసంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని వారికి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
శ్రావణ మాసంలో మొత్తంగా 16 రోజుల పాటు మల్లికార్జున స్వామివారికి పలు రకాల సేవలను నిలిపి వేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే శ్రావణమాసంలో ఐదు రోజుల పాటు అంటే ఆగస్ట్ 15 నుంచి 19 తేదీలు మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ రోజుకు 4 విడతలుగా స్వామివారి స్పర్శ దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నట్టు ఈవో వెల్లడించారు. శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలను తెలుస్తారట. కానీ 5:30 వరకూ ఆలయంలోకి భక్తులకు అనుమతి ఉండదు. 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు దర్శనాలను కల్పిస్తారట. రెండు, నాల్గవ శ్రావణ శుక్రవారాల్లో మహిళలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.