సముద్రపు నీరు ఉప్పగా ఉండటానికి కారణం పార్వతీదేవి శాపమేనట..

సముద్రం చూడటానికి చాలా భయంగా అనిపిస్తుంది. గంభీరం, హోరు చూస్తుంటేనే భయపడతారు. అయితే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందని అందరికీ తెలిసిందే. తాగడానికి పనికి రాదు. దీనికి మనకు తెలిసిన కారణం ఏంటంటే లవణాల శాతం ఎక్కువగా ఉండటం వలన ఉప్పగా ఉంటాయి. శివపురాణం ప్రకారమైతే నీరు ఉప్పగా ఉండటానికి మరో కారణం ఉంది. అదేంటంటే.. శివుడిని భర్తగా పొందాలని ఆశపడిన పార్వతీదేవి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేస్తోంది. పార్వతీదేవి తపస్సు చేస్తుండగా సముద్రుడు చూసి ఆమె రూపాని ముగ్దుడయ్యాడు.

ఎలాగైనా పార్వతీదేవిని సొంతం చేసుకోవాలనుకున్నాడు. నేరుగా పార్వతీ మాత వద్దకు వెళ్లి పెళ్లి ప్రస్తావనను సముద్రుడు తీసుకొచ్చాడు. దీనికి పార్వతీ దేవి తాను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నానని ఆయననే వరిస్తానని తెలిపి సముద్రుడి ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ మాటలు విన్న సముద్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తాను ప్రజల దాహార్తిని తీరుస్తానని.. తన నీరు మధురంగా ఉంటుందని.. పాలలా స్వచ్ఛమైనదని.. తనను తిరస్కరించవద్దంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి నువ్వు ఏ నీటిని చూసుకుని అంత గర్వ పడుతున్నావో ఆ నీరు ఎవ్వరూ తాగలేనంత ఉప్పగా మారిపోతాయంటూ శాపమిచ్చింది. ఈ శాప ఫలితంగానే సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందట.

Share this post with your friends