తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 14వ తేదీన శాస్త్రోక్తంగా పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్ 13వ తేదీ సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకూ అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జూన్ 14న ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న పురాతన హిందూ వైష్ణవ దేవాలయం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. క్రీ.శ.1130లో రామానుజులవారు ప్రతిష్ఠించారు. ఈ ఆలయం తిరుపతిలోని తొలి నిర్మాణాలలో ఒకటి. జిల్లాలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. కొండ దిగువన ఉన్న ఈ ఆలయం చుట్టూ తిరుపతి నగరం నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. చిదంబరంలోని గోవిందరాజ పెరుమాళ్ ఆలయంపై దాడి సమయంలో, ఉత్సవ మూర్తిని సురక్షితంగా ఉంచడం కోసం తిరుపతికి తీసుకువచ్చారని నమ్ముతారు. దండయాత్రల అనంతరం ఉత్సవ మూర్తిని వెనక్కి తీసుకున్నారు.