అన్ని శివాలయాల్లోకి ఈ ఎండల మల్లికార్జున స్వామి ప్రత్యేకతే వేరు..

ఎక్కడ భగవంతుడు వెలిసినా కూడా వెంటనే ఆలయం కట్టేస్తారు. కానీ ఇక్కడి మల్లికార్జున స్వామికి మాత్రం ఆలయం లేదు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉంటాడు. అందుకే ఆయనను ఎండల మల్లికార్జనుడని పిలుస్తారు. ఇంతకీ ఈ స్వామివారు ఎక్కడుంటారంటారా..? శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో గల టెక్కలి మండలం రావివలసలో ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివయ్య కొండ మీద కొలువై ఉంటాడు. ఇక్కడ లింగ రూపంలో శివయ్య పూజలు అందుకుంటూ ఉంటాడు.

మరి ఆలయం ఎందుకు నిర్మించలేదని అంటారా? ఈ శివలింగం ఎంత పెద్దదంటే.. భారతదేశంలోని ఆలయాలన్నింటిలోకెల్లా పెద్దది. ఇంత పెద్ద శివలింగాన్ని ఇక్కడ మాత్రమే చూడగలుగుతారు. అయితే ఇక్కడ క్రీ.శ. 1870 సంవత్సర ప్రాంతంలో టెక్కలి జమీందార్ ఆలయాన్ని అయితే నిర్మించారు. కానీ అది ఎంతోకాలం ఉండలేదట. కొంతకాలానికే శిథిలమై పోయింది. తరువాత మరికొంత కాలానికి ఆలయ నిర్మాణ ప్రయత్నం చేసినా కూడా ఫలించలేదట. అప్పట్లో భక్తుల కలలో శివయ్య కనిపించి తనకు ఆలయ నిర్మాణం చేయవద్దని.. తాను ఆరుబయటే ఉంటానని.. అదే లోక కల్యాణమని చెప్పాడట. అప్పటి నుంచి ఎండకు ఎండుతూ ఉంటాడు కాబట్టి ఈ స్వామిని ఎండల మల్లికార్జున స్వామిగా పిలుస్తున్నారు. ఈ శివయ్య.. శ్రీరామునితో పూజలందుకున్నాడని చెబుతారు.

Share this post with your friends