మాస శివరాత్రిని ప్రతి నెలా కృష్ణ పక్ష చతుర్థి తిధి నాడు జరుపుకుంటూ ఉంటాం. ఈ మాస శివరాత్రిని శివుని తాండవ నృత్యానికి చిహ్నంగా కూడా పరిగణిస్తూ ఉంటాం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పురాణాల ప్రకారం.. మాస శివరాత్రి రోజున శివుడు విశ్వాన్ని నాశనం చేసి మళ్లీ సృష్టిస్తాడని నమ్ముతారు. ఇవాళ శివపార్వతులను పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ మాస శివరాత్రి నాడే సాగర మథనం ప్రారంభమైందని చెబుతారు. ఇదే రోజున శివుడు.. పార్వతిని భార్యగా స్వీకరించాడని కూడా చెబుతారు. ఈ నెల 4వ తేదీనే మాస శివరాత్రి. అసలు మాస శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారనే విషయం గురించి ఓ కథ ఉంది. అదెంటో తెలుసుకుందాం.
పురాణం ప్రకారం ఒకసారి.. విష్ణు మూర్తి, బ్రహ్మల మధ్య పెద్ద వివాదమే నడిచిందట. ఆ వివాదం ఏంటంటే.. ఎవరు గొప్పవారు? అనే విషయమై నడిచింది. క్రమక్రమంగా వారి వివాదం పెరగడం ఆరంభమైందట. ఆ సమయంలో శివుడు అగ్ని స్తంభం రూపంలో కనిపించాడట. ఈ స్తంభం ఆది అంతాలను కనుగొనమని బ్రహ్మ, విష్ణు మూర్తికి శివుడు సూచించాడట. ఎంత ప్రయత్నించినా కూడా వారిద్దరూ దాని అంతాన్ని కనుక్కోలేకపోయారట. అప్పటి నుంచి మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం.. శివలింగానికి జలాభిషేకం చేయడం మొదలు పెట్టారు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మనిషి అహంకారం నాశనం అవుతుందట.