హిందువుల ఇంట దాదాపుగా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కకు మతపరమైన ప్రాధాన్యతే కాకుండా ఔషధ పరంగానూ చాలా మంచింది. దీనిని అనేక రకాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఎన్నో వ్యాధుల నివారణకు ఇది సాయపడుతుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వలన పర్యావరణం స్వచ్ఛంగా మారడమే కాకుండా సానుకూల శక్తి పెరుగుతుంది. అయితే వేసవి కాలంలో తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది. దీనికి తీవ్రమైన సూర్యకాంతి, నీటి కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా తులసి మొక్కలు ఎండిపోతాయి. లేదంటే తులసి దళాలు పసుపు రంగులోకి మారుతాయి.
తులసి ఎండిపోతే అదో అపశకునంగా భావిస్తారు. తులసి మొక్కకి సూర్యరశ్మి ఎక్కువగా పడితే మొక్క ఎండిపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో తులసి మొక్కను ఉదయం తేలికపాటి సూర్యకాంతి పడే ప్రదేశంలో మాత్రమే మొక్కను ఉంచాలి. అలాగే మధ్యాహ్నం తీవ్రమైన ఎండ ఉంటుంది. కాబట్టి తులసి మొక్కను బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. నీడ పడే ప్రదేశంలో లేదా ఆకు పచ్చ వల ఉపయోగించండి. మొక్కను బాల్కనీ లేదా కిటికీ దగ్గర ఉంచితే అక్కడ తులసి మొక్కకు తేలికపాటి సూర్యకాంతి తగులుతుంది. అలాగే తులసి మొక్కకు ఎండాకాలంలో నీరు చాలా అవసరం. ఎక్కువ నీళ్లు పోస్తే దాని వేర్లు కుళ్లిపోతాయి. కాబట్టి ఉదయం, సాయంత్రం నీళ్లు పెట్టండి.