శివుడిని భోళా శంకరుడని అంటారు. కేవలం నీళ్లతో అభిషేకం చేసినా కూడా పొంగిపోయి మనం కోరిన కోరికలు తీరుస్తాడట. మన దేశంలోని ప్రతి ఊరిలోనూ దాదాపు శివాలయం ఉంటుంది. అయితే అభిషేకాల వంటివేమీ చేయకుండానే కేవలం దర్శనంతోనే కోరిన కోరికలు తీర్చే ఆలయాలు కూడా ఉన్నాయి. మరి ఆ క్షేత్రాలేంటో చూద్దామా? జంబుకేశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంటుంది. ఈ ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయం 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. జంబుకేశ్వర ఆలయంలోని శివలింగాన్ని అప్పు లింగమని కూడా పిలుస్తారు. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఇక్కడి పూజారులు స్త్రీల వస్త్రాలు ధరించి స్వామివారికి పూజలు చేస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయట.
ఏకాంబరేశ్వర దేవాలయం. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. దేశంలోని అతి పెద్ద 10 దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. 23 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ శివలింగం ఓ మామిడిచెట్టు కింద ఉంటుంది. దీనిని చూస్తే చాలట.. కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయట. ఇక దర్శిస్తే కోరిన కోరికలు.. కష్టాలు తీర్చే శివాలయాల్లో అరుణాచలం ఒకటి. తమిళనాడులో తిరువణ్ణామలైలో ఈ అరుణాచలేశ్వర దేవాలయం ఉంటుంది. ఈ ఆలయంలోని శివయ్యను సందర్శిస్తే చాలు జీవితంలోని చీకటంతా తొలగిపోయి అపారమైన శక్తి వస్తుందట. దాదాపు మూడు అడుగుల ఎత్తుండే ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు దక్షిణ భారతదేశంలోని నలుమూలల నుంచి వస్తుంటారు.