అది ఒకప్పుడైతే దండకారణ్యం.. అక్కడ ఓ ప్రాచీన కాలం నాటి ఆలయం. ఇక్కడకు వచ్చి ఒకరోజు నిద్ర చేస్తే కష్టాలన్నీ తొలిగిపోయి సుఖసంతోషాలతో ఉంటామని ప్రతీతి. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి బావుసాయిపేట గ్రామాలకు మధ్యలో రాముల గుట్ట అనే ప్రాంతంలో ఉంది. ఇది వచ్చేసి శ్రీ సీతారామ స్వామివారి ఆలయం. మాఘమాసంలో పెద్ద ఎత్తున జాతరతో పాటు రథోత్సవాలు కన్నుల పండవగా జరుగుతాయి. ఈ ఆలయం శాలివాహన కాలం నాటిది. రాజరాజ నరేంద్రుడు పాలించిన సమయంలో ఈ ప్రాంతం మహామునిపల్లెగా పిలవబడేది.
అప్పట్లో ఈ అరణ్యానికి రాముల వారు అరణ్యవాసంలో భాగంగా వచ్చారట. ఆ సమయంలో ఓ ముని మహాముని పల్లెలో తపస్సు చేస్తుండగా ఆయన వద్దకు వచ్చారట. అక్కడే కాసేపు రాముల వారు సేదతీరారట. అనంతరం మహాముని పల్లె.. మామిడిపెళ్లిగా పిలవబడుతోంది. శ్రీరామనవమి వచ్చిందంటే చాలు.. ఈ ప్రాంతానికి పండుగే. 9 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇక మాఘమాసంలోనూ ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి ఎండ్లబండ్లతో పాటు వివిధ మార్గాల్లో రాముల వారి గుట్టకు చేరుకుని అక్కడే వంట చేసుకుని రాత్రి అక్కడే నిద్రిస్తారు. ఇలా నిద్ర చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారని ప్రతీతి.