దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడిగా పేరొందిన కూసుమంచి గురించి చాలా మందికి తెలియదు. ఈ క్షేత్ర విశేషాలు.. స్థల పురాణం గురించి తెలుసుకుందాం. కాకతీయులు నిర్మించిన అతి పురాతన శివాలయం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కూసుమంచి ఉంది. ఖమ్మం పట్టణం నుంచి 24 కి.మీ. దూరంలో కూసుమంచి ఉంది. అప్పట్లో దీనిని కుప్రమణి అని పిలిచేవారు.కాకతీయులు రాజ్య అవసరాల కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం ఈ కూసుమంచి గణపేశ్వర ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఇక ఈ ఆలయ నిర్మాణం కోసం వరంగల్ వేయి స్తంభాల గుడిని పోలి ఉండే రాతిని ఉపయోగించారట.
ఈ ఆలయంలో ఉన్న శివలింగం మూడు మీటర్ల ఎత్తులో ఉంది. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద శివలింగాలలో ఒకటి. ఈ ఆలయ నిర్మాణం కోసం సిమెంటు, ఇసుక వంటివి ఏమీ వినియోగించలేదట. పెద్ద పెద్ద రాళ్లను గాడులూ, కూసాల పద్ధతిలో బిగించి ఈ ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో శివలింగంపై ప్రతి నిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించడం మరో విశేషం. అయితే ఈ ఆలయ నిర్మాణ విషయంలో ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే.. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. అయితే వందల ఏళ్ల నాటి శివాలయం ఇటీవలి కాలంలో శిథిలావస్థకు చేరుకుంది.