శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుంచి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 10.45 గంటల వరకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది. ఇవాళ సాయంత్రం ధ్వజావరోహణంతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 9.25 నుంచి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. అనంతరం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.