శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి వెండి ఉయ్యాల బహుకరణ

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి తిరుపతికి చెందిన హేమంత్ అనే వ్యక్తి స్వామివారికి ఏకాంత సేవకు వినియోగించేందుకు రూ 4 లక్షలు విలువైన వెండి ఉయ్యాలను తాజాగా బహుకరించారు. ఆలయంలో డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్‌కు దాత ఈ ఉయ్యాలను అందజేశారు. ప్రస్తుతం అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేంకటేశ్వర స్వామివారి అతి ముఖ్యమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వేంకటేశ్వర స్వామివారు వివాహమాడిన అనంతరం తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళుతూ అప్పలాయగుంటలో ఆగారట.

అక్కడ తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలోనే కొలువు దీరాడని స్థల పురాణం చెబుతోంది. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించారట. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం. ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడి ఆలయం ఎత్తైన కొండలు, పంట పొలాల మధ్య ఉండటంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది.

Share this post with your friends