మనం ఏ శుభకార్యమైనా కానీ గణపతిని పూజించకుండా మొదలు పెట్టం. మనం తలపెట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా తొలి పూజ ఆయనకే చేస్తూ ఉంటాం. మన దేశంలో దాదాపు ప్రతి ఊరిలోనూ గణపతి క్షేత్రాలున్నాయి. మహారాష్ట్రలో అష్ట వినాయక క్షేత్రం ఉంది. దీనిలో ఉండే మయూర గణపతి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. వినాయకుడి వాహనం ఎలుక. ఇక్కడ మాత్రం వినాయకుడి వాహనం నెమలి. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం. క్షేత్రాన్ని బట్టి వాహనం మారుతుందా. అంటే అలా మారదు కానీ ఇక్కడ ఇలా ఉండటానికి ఓ కథ ఉంది.
స్థల పురాణం ప్రకారం.. పూర్వం మోర్ గావ్ ప్రాంతంలో సింధురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను చాలా ఇబ్బంది పెట్టేవాడు. విసిగిపోయిన దేవతలు, మునులు తమను కాపాడమని వినాయకుడిని ప్రార్ధించారట. అప్పుడు వినాయకుడు వారిని రక్షించేందుకు గానూ.. నెమలి వాహనంపై వినాయకుడు వచ్చి సింధురారుసురుడిని సంహరించాడట. అప్పడు వినాయకుడిని నెమలి వాహనంపై ప్రతిష్టించి స్వామివారిని పూజించారట. ఈ వినాయకుడిని పూజిస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుందట.