ఆషాడ అమావాస్య ప్రత్యేకత ఏంటో తెలుసా?

అమావాస్య తిథి.. అందునా ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట. వాస్తవానికి ఆషాడ మాసంలోని అమావాస్య రోజనున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు. అసలు ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది. ఆ రోజున ఏం చేయాలి? ఆషాడ అమావాస్య జూలై 5 ఉదయం 4:57 గంటలకు ప్రారంభమై.. 6న తెల్లవారుజామున 4:26 గంటలకు ముగుస్తుంది. కాబట్టి జూలై 5న అమావాస్యను జరుపుకోవాలి.

ఆషాడ అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుశ, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకుని తర్పణం చేయాలి. అశ్వత్థ చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఈ వృక్షంలోనే మన పూర్వీకులు ఉంటారని నమ్మకం. ఆపై వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యాన్ని, పిండిని దానంగా ఇస్తే చాలా మంచిదట. అలాగే ఉప్పు, పంచదారను కూడా దానం ఇవ్వవచ్చు. ఇక చేయకూడని పనులేంటంటే.. పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. మద్యం మాంసాన్ని ముట్టడం కానీ.. గొడవలు పడటం కానీ చేయకూడదు. అలాగే ఎవరైనా బిక్షగాడు మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు.

Share this post with your friends