తాటకి అనే రాక్షసి వధించి శ్రీరాముడు యాగ పరిరక్షణ చేసిన కథ గురించి తెలుసా? కేవలం 15 ఏళ్ల వయసులోనే ఇదంతా రామయ్య తండ్రి చేశాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి, తాను చేసే యాగాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు విధ్వంసం చేస్తున్నారనీ, వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముడిని తనతో పంపమని దశరథ మహారాజుని కోరాడు. పదిహేను సంవత్సరాల బాలుడు కౄర రాక్షసులను నిలువరించలేడనీ, కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగ రక్షణ చేయడానికి అనుమతించమనీ దశరథుడు అర్ధించాడు. అయినా విశ్వామిత్రుడు తనకు రాముడే కావాలని స్పష్టం చేశాడు. ఇక కులగురువు వశిష్టుని ప్రోత్సాహంతో దశరథుడు.. విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపాడు.
మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు. మన్మదాశ్రమంలో విశ్రాంతి తీసుకున్న మీదట భయంకరమైన తాటక వనంలోకి రామలక్ష్మణులు చేరుకున్నారు. గురువు ఆజ్ఞపై రాముడు తాటకిపైకి వాడి బాణాన్ని సంధించి సంహరించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి, వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలు, వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. అనంతరం వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి వెళ్లారు. అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ, యాగ సంరక్షణా బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహులు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుని.. వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమికొట్టాడు. యజ్ఞం నిర్విఘ్నంగా ముగిసింది. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు.