మన పాపాలను తొలగించుకునే దశపాపహర దశమి గురించి తెలుసా?

లోకంలో మనుషులు తెలిసీ తెలియక పాపాలను చేయడం సహజమే. అయితే అప్పుడు చేస్తున్నది పాపమని తెలియదు కానీ వాటి ఫలితం అనుభవించేటప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఆ పాపాలను తొలగించుకోవడం ఎలాగా? అని ఆలోచిస్తారు. అయితే మన పూర్వీకులు మనకు శాస్త్రాల రూంలో పాప విముక్తికి ఏం చేయాలో వివరించారు. పాప విముక్తి కోసం‘దశ పాపహర దశమీ వ్రతం’ చేయాలట.‘దశ పాపహర దశమి’ గురించి చాలా మంది విని ఉండరు. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమిని ‘దశ పాపహర దశమి’గా సంబోధిస్తారు. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే.. ఇదే రోజున గంగా మాత అవతరించిందట. దశ పాపాలు అంటే పది రకాలైన పాపాలు.

శాస్త్రోక్తంగా కొన్ని విధులను పాటిస్తూ పండుగను జరుపుకోవడం వల్ల ఈ పది పాపాలు తొలగిపోతాయట. ఉత్తరాదిన దీనిని మరో రకంగా పిలుస్తారు. గంగానది ఆవిర్భవించిన రోజు కనుక ఉత్తరాదిన ‘గంగా దశహర గంగోత్సవం’గా పిలుస్తారు. ముఖ్యంగా ఇవాళ గంగాదేవిని ఆరాధిస్తే మన ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంలో వివరించడం జరిగింది. అలాగే స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించడం జరిగింది. మరి రామాయణంలో గంగోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని వివరించారో తెలుసా? వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి.. తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుకుంటానని మొక్కుకున్నట్టు రామాయణ కథ. ఈ రోజు గంగా స్నానం, పూజ దశ విధాలైన పాపాల నుంచి విముక్తి కలిగిస్తుంది.

Share this post with your friends