విష్ణుమూర్తి శయనంలోని రకాల గురించి తెలుసా?

విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. స్వామివారిని మనం శయన, ఆసన, స్థానక, నృత్య రూపాల్లో దర్శించుకుంటూ ఉంటాం. శయన విగ్రహాలు ముఖ్యంగా యోగం, సృష్టి, భోగం, సహారం అనే నాలుగు విధాలుగా ఉంటాయి. మరి ఈ నాలుగు వేటికి ప్రతీకలో తెలుసా? యోగం.. ముక్తికి, సృష్టి – వృద్ధికి, భోగం – భుక్తికి, సహారం – అభిచారికాలకు ప్రతీక. శయన విగ్రహాలైతే.. నదీతీరాల వెంబడి, సరస్సుల పక్కన ప్రశస్తమైనవిగా చెపుతారు. యోగ శయనం అని ఎప్పుడు అంటామంటే.. విష్ణు మూర్తి ఎర్ర తామర రేకుల వంటి నేత్రాలతో ఒక పక్కగా పడుకున్నట్టు అంటే అర్థశయనంలో పడుకున్నప్పుడు. ఐదు పడగల శేషుపై విష్ణుమూర్తి శయనించినప్పుడు గౌరవశ్యామ వర్ణంతో, పీత శ్యామ వర్ణంతో కానీ ఉంటాడు.

తొమ్మిది పడగల శేష పాన్సుపై పద్మ నయనాలతో, రాజసంతో.. నల్లని శరీర ఛాయ, ఎర్రని అరికాళ్లతో శయన రూపంలో విష్ణు మూర్తి ఉంటే దానిని సృష్టిశయనం అని పిలుస్తారు. ఉత్తమ సృష్టి శయనం అంటే.. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు. ఆదిత్యులు, కిన్నెరలు, మార్కండేయ, భ్రుగు, నారద మహర్షులను, మధుకైటభులతో కలిగిన శయనం. సకల పరివారంతో ఏడు పడగల శేషునిలో పడుకుని ఉంటే అది భోగ శయనం. రెండు పడగల శేషుని పాన్పుగా చేసుకుని కనులు మూసి తామస భావాన్ని వ్యక్తం చేస్తూ గాఢ నిద్రలో ఉంటే అతి సంహార శయనం.

Share this post with your friends