తేలును సైతం పూజించేవారుంటారా? తేలుకు సైతం ఓ విగ్రహం ఉందా? అంటే కచ్చితంగా ఉంది. అదెక్కడంటే.. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 15కి.మీ దూరంలో ఉన్న కండ్కూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ కొండమ్మాయి దేవాలయం ఉంది. ఈ చిన్న దేవాలయంలో నాగ పంచమి రోజున ఒక భిన్నమైన వేడుకను జరుపుకుంటారు. ఈ ఆలయంలో తేలు విగ్రహం ఉంది. నాగపంచమి రోజున ఇక్కడి ప్రజానీకం తేళ్లను పూజించడమే కాదు.. తేళ్లతో ఆడుకుంటారు. అలాగే వాటిని తమ ముఖాలపై నోటిలోనూ ఉంచుకుంటారు. ఇక నాగపంచమి రోజైతే కేవలం తేలును దర్శించుకునేందుకే ఇక్కడికి భక్తులు వస్తుంటారు.
హిందూ సనాతన ధర్మంలో ప్రకృతిని జంతువులను పూజించడం వింతేమీ కాదు.. ఇందులో భాగంగానే పాములను సైతం నాగమ్మగా పూజిస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ కాస్త వెరైటీగా తేలును పూజిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలోని ఐదవ రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పండగ సమయంలో తేళ్లు తమని కుట్టిన సందర్భాలు చాలా తక్కువట. తేళ్లను మొహంపై వేసుకున్నా.. నోటిలో పెట్టుకున్నా కూడా కుట్టవట. ఇలా తేళ్లను పూజించే ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతోందని అక్కడి ఆలయ పూజారులు చెబుతున్నారు.