కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రం స్వామివారి శరణుఘోషతో మారుమోగింది. మకరజ్యోతిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు శబరిమలకు చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు శబరిమల సన్నిధానానికి చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో మకరజ్యోతి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పెద్ద ఎత్తున హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిని స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణుఘోష చేశారు. ఒక్కసారిగా శబరిగిరులు స్వామివారి శరణుఘోషతో ప్రతిధ్వనించాయి.
అసలు శబరిమల విశిష్టేంటో తెలుసుకుందాం. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని చెబుతారు. దీనిని అయ్యప్ప భక్తులు సైతం విశ్వసిస్తారు. ముందుగా ఈ రోజు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు అయ్యప్పస్వామికి అలంకరించి మూలమూర్తికి హారతి ఇచ్చారు. ఆ తరువాత క్షణాల్లోనే తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. చీకట్లను చీలుస్తూ జ్యోతి దేదీప్యమానంగా వెలగడంతో అది చూసిన భక్తుల్లో భక్తిభావన ఉప్పొంగింది. తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు.