ఈ విమలాదిత్యుని పూజిస్తే ఎలాంటి వ్యాధి అయినా ఇట్టే నయమవుతుందట..

కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలన్న తలంపు మన మనసులోకి వస్తే మన సకల పాపాలు నశిస్తాయని అంటారు. కాశీలో విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, డుంఠి గణపతి తదితరులంతా ఉంటారు. వీటితో పాటు సూర్యుని ఆలయాలు 12 కూడా ఉన్నాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో ఇక్కడ సూర్యభగవానుడిని పిలుస్తూ ఉంటారు. వీటిలో విమలాదిత్యుడి ఆలయం చెప్పుకోదగినది. దీని కథ ఏంటంటే.. పూర్వం విమలుడు అనే రాజు కుష్ఠు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. మందులూ, పూజలు, వ్రతాలవంటివేమీ ఆయనను ఆ వ్యాధి నుంచి బయటపడేయలేకపోయాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విమలుడు భార్యాబిడ్డలను వదిలేసి కాశీ క్షేత్రానికి వెళ్లిపోయాడు.

కాశీ పట్టణంలో ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో విమలుడు ఆరాధించేవాడు. ప్రతిరోజూ గంగా స్నానం చేసిన వెంటనే ఆదిత్యునితో పాటు శివుడిని సైతం అభిషేకిస్తూ ఉండేవాడు. విమలుని తపస్సుకి సంతుష్టుడైన సూర్యభగవానుడు ఆయన ముందు ప్రత్యక్షమై కుష్టు వ్యాధి నుంచి బయటపడేస్తాడు. విమలుడు ప్రతిష్ఠించి పూజించిన మూర్తి కాబట్టి.. ఆ ఆలయంలోని సూర్య భగవానుడికి విమలాదిత్యుడు అనే పేరు వచ్చింది. ఈ విమలాదిత్యుడిని పూజిస్తే భయంకరమైన వ్యాధులు కూడా ఇట్టే పోతాయని నమ్మకం. నిత్యం విమలాదిత్యుడిని పూజిస్తే సకల రోగాల నుంచి విముక్తితో పాటు మానవుని దుఃఖానికి కారణమైన దారిద్య్ర బాధలు, సంసార దుఃఖాలు ఉండవని చెబుతారు.

Share this post with your friends