విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో తొలి సారెను దుర్గమ్మకు ఆలయ వైదిక కమిటీ తరుఫున సమర్పించడం జరిగింది. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఈవో కె.ఎస్.రామారావు, స్థానా చార్యులు శివప్రసాదశర్మ, ఆలయ అర్చకులు కనకదుర్గా నగర్‌లోని గోశాల నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారిక సారె సమర్పించారు.
ఈ నెల 14వ తేదీన అమ్మవారికి తెలంగాణ బోనాన్ని సమర్పించనున్నారు. ఈ నెల 6 నుంచే అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ ఆషాఢ మాసం ముగిసే వరకూ కొండపై ప్రతి రోజూ పండుగ వాతావరణం ఉంటుంది. ఇక ఈ ఆషాఢంలో సారె సమర్పణే కాకుండా వారాహి నవరాత్రులు, శాకంబరీ ఉత్సవాలు వంటివి వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.