29 నుంచి ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్ర.. భద్రతపై కేంద్రం ఫోకస్..

అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. అమర్‌నాథ్‌ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. అమర్‌నాథ్ ఆలయం భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ తహసిల్‌లో ఉంది. సింధ్ వ్యాలీలో ఉన్న ఈ గుహ చుట్టూ హిమానీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. వేసవిలో కొద్ది కాలం పాటు యాత్రికుల కోసం తెరిచి ఉంచడం జరుగుతుంది. ఆ సమయంలో తప్ప సంవత్సరంలో ఎక్కువ భాగం ఇది మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగం స్వయంభూ లింగం. ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ఈ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భద్రతా పరమైన విషయాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం రియాసిలో టూరిస్టుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై జమ్మూలోని భగవతి నగర్‌లో ఉన్న బేస్‌ క్యాంప్‌ దగ్గర మాక్‌డ్రిల్ నిర్వహించారు. దీనిలో జమ్ముకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ , క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ కమెండోలు పాల్గొన్నారు. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కానీ.. ఇబ్బంది కానీ కలగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.

Share this post with your friends