తిరుమలలో గదుల బండారం బయటకొచ్చింది..

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జే శ్యామలరావు బాధ్యతలు చేపట్టాక దళారీ వ్యవస్థ, గదుల విషయంలోనూ ఫోకస్ పెట్టారు. గదులను అక్రమంగా తీసుకుని అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారని తెలిసింది. దీంతో తిరుమల పోలీసులు రంగంలోకి దిగారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ రూం బుకింగ్ సిస్టమ్‌ ద్వారా.. ఇద్దరు వ్యక్తులు చేస్తున్న బాగోతాన్నంతా వెలికి తీశారు. వారిని అరెస్ట్ చేశారు. టీటీడీ బుకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి నిందితులు ఏకంగా 45 గదులను బుక్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వీరు రెండు నెలలుగా తరచూ గదులు బుక్ చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితులిద్దరినీ కృష్ణా జిల్లాకు చెందిన నాగ బ్రహ్మచారి, వరంగల్ కు చెందిన వెంకటేశ్వరరావుగా తిరుమల పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే వీరిద్దరి వెనుక ఎవరో ఉన్నారనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఇద్దరూ భక్తుల ఆధార్ కార్డుల సాయంతో టీటీడీని మోసగిస్తున్నారు. అవి నకిలీవా? లేదంటే అరువుగా తీసుకున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఆధార్ కార్డులతో తీసుకున్న రూములను భక్తులకు అధిక ధరకు విక్రమిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా వీకెండ్‌లో గదుల కొరత ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని స్కామ్‌లకు పాల్పడుతున్నారు.

Share this post with your friends