జూన్ ౩౦న వకుళమాత ఆలయ వార్షికోత్సవం

తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరుగనుంది. వకుళా దేవి, కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వేంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారమని చెబుతారు.

వకుళ మాత ఆలయాలు తిరుమలలో మూడు ఉన్నాయి. మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర వున్న మాలాడిగుండం దగ్గర ఉంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న పోటు (వంటగది) లో ఉంది. పోటులో ఉన్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకుకి కావలసిన తిను బండారాలను శుచిగా, శుభ్రంగా వండిస్తుంది అంటారు. వకుళ మాతే బంగారు తులసీ పత్ర హారం (వకుళ మాల) గా మారి శ్రీవారి మెడలో చేరిందని చెబుతారు. అందుకే శ్రీవారిని తులసీ దళాలతో పూజిస్తూ ఉంటారు.

Share this post with your friends