అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు ఈ ఉత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ ఉదయం స్వామివారు కల్పివృక్ష వాహనంపై విహరించారు. ఇవాళ సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు. మూడో రోజైన బుధవారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో నగిరి ఎంఎల్ ఏ శ్రీ గాలి భాను ప్రకాష్, ఆలయ ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టార్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.