నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో పాటు వీకెండ్ కూడా కావడంతో క్షేత్రమంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది.
మరోవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో శని, ఆది, సోమవారాలో ఆర్జిత సేవ, అభిషేకాలు, కుంకుమార్చనను ఆలయ అధికారులు నిలిపిశారు. భక్తులు రద్దీగా ఉండడంతో స్పర్శ దర్శనానికి మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం రావడంతో భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నారు.