ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయంలో సరిహద్దు గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న ఒడిశా ప్రభుత్వం దీనిపై ఆరా తీసింది. శతాబ్దాల నాటి కట్టడం పగుళ్లు రావడంతో వెంటనే మరమ్మత్తు కోసం భారత పురావస్తు శాఖ సహాయాన్ని ఒడిశా ప్రభుత్వం కోరింది. ఆలయంలోని ఆలయంలోని మేఘనాథ ప్రాచీర గోడకు పగుళ్లు వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంటనే సేవకులు ఆందోళనకు దిగారు. పగుళ్ల కారణంగా పూరి జగన్నాథ్ ఆలయ గోడల నుంచి మురికి నీరు కారుతోంది. ఈ మురికి నీరు ఆనందబజార్ నుంచి రైసర్ లోపలకు వస్తోంది.
నిత్యం మురికి నీరు లీక్ అవుతూ ఉండటం వలన కొన్ని చోట్ల నాచు పేరుకుపోయింది. దీంతో ఆలయంలో నాచు పేరుకుపోయి పలు చోట్ల మచ్చలు కనిపిస్తున్నాయని సేవకులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆలయ భద్రత విషయంలో ఆలయ అధికారులు అత్యంత శ్రద్ధ కనబరుస్తుంటారు. అయితే సమాచారం అందుకున్న వెంటనే భారత పురావస్తు శాఖ ఆలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. ఈ తనిఖీ సమయంలో ఎస్‌జేటీఏకి చెందిన సాంకేతిక బృందం కూడా ఉంది. ఆలయ మరమ్మత్తులు తక్షణమే నిర్వహించాలని భారత పురావస్తు శాఖను భక్తులు కోరుతున్నారు.